
Srikanth Odela: సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పవు. అలాంటి రంగంలో అడుగుపెట్టే తొలినాళ్లలోనే దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్ దగ్గర పనిచేసే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పైగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా నెలకు ఏకంగా రూ.50,000 జీతం అంటే చిన్న విషయం కాదు. కానీ ‘దసరా’ ఫేమ్, నేచురల్ స్టార్ నానితో ‘#TheParadise’ చిత్రాన్ని తెరకెక్కించి వరుస సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాత్రం ఆ కళ్లు చెదిరే ఆఫర్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించారు. కేవలం సుకుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలన్న ఒకే ఒక్క పట్టుదలతో ఆ సూపర్ ఛాన్స్‌ను వదులుకున్న సంచలన నిజాన్ని తాజాగా ఆయన పంచుకున్నారు.
లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీకాంత్ ఓదెల తన కెరీర్ ఆరంభంలో ఎదురైన అరుదైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. “భారతీయ చిత్ర పరిశ్రమలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఉన్న ఒకరి వద్ద నాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది (ఆయన పేరు చెప్పను). రాత్రికి రాత్రే జరిగిన ఓ పరిణామంతో మరుసటి రోజు ఉదయమే పిలుపొచ్చింది. ‘రేపటి నుంచే వచ్చి డ్యూటీలో చేరిపో.. నీకు నెలకు రూ.50,000 జీతం ఇస్తా’ అని నేరుగా చెప్పారు. ఆ రోజుల్లో ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ.50 వేలు ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు” అని శ్రీకాంత్ తెలిపారు.
అంతటి అగ్ర దర్శకుడి వద్ద ప్రాజెక్ట్, చేతినిండా భారీ మొత్తం లభించే అవకాశం కళ్లముందున్నా శ్రీకాంత్ ఓదెల మనసు మాత్రం మారలేదు. ఆ దర్శకుడి ముందే నిలబడి.. “క్షమించండి సార్, నా ఏకైక గోల్ సుకుమార్ గారి దగ్గర పనిచేయడమే. ఆయన దగ్గరే పని నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. అక్కడ చేశాక భవిష్యత్తులో వేరే ఆలోచన చేస్తా తప్ప ఇప్పుడు ఇక్కడ చేరలేను” అని కుండబద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చారు. డబ్బు కంటే, తక్షణ అవకాశం కంటే తాను కలలుగన్న గురువు వద్దే శిష్యరికం చేయాలన్న ఆయన నిబద్ధత ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అంత భారీ ఆఫర్‌ను కాదనుకున్న తర్వాత శ్రీకాంత్ ఓదెలకు సుకుమార్ వద్ద అవకాశం అంత సులువుగా దక్కలేదు. సుకుమార్ దృష్టిలో పడేందుకు ఆయన చాలా శ్రమించారు. తాను తీసిన షార్ట్ ఫిల్మ్‌లను చూపించి, ఎన్నో ఇబ్బందులు, తిప్పలు దాటుకుని చివరకు సుకుమార్ టీంలో స్థానం సంపాదించుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఆయన సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన అఫీషియల్ జర్నీని స్టార్ట్ చేశారు. ఆ రోజు తీసుకున్న మొండి నిర్ణయమే నేడు ఆయనను టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకరిగా నిలబెట్టింది.














