ఢిల్లీ అత్యాచార ఘటనపై 1000 పేజీల ఛార్జిషీటు

1000 pages chargesheet on delhi gang rape“అమానత్”… “నిర్భయ”… “దామిని” ఈ పేర్లన్నీ రక్షణ కోల్పోయిన సగటు భారతీయ వనితను గుర్తుకు తెస్తున్నాయి. దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురై, మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ఆ అభాగ్యురాలికి జరిగిన అన్యాయానికి భారతీయ శిక్షాస్మృతి (ఐ.పీ.సీ) చట్టప్రకారమైన చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులు 1000 పేజీల ఛార్జిషీటును సిద్ధం చేశారు. గురువారం కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి 30 ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. అత్యాచార బాధితురాలు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో నిందితులపై హత్యానేరాన్ని కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అత్యాచార బాధితురాలు మృతికి సంతాపంగా దేశరాజధానిలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. జంతర్‌మంతర్ వద్ద వందలాది మంది సమావేశమై మృతురాలికి శ్రద్ధాంజలి ఘటించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకునేందుకు కఠిన చట్టాలు చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు.