యువతి స్నేహితుడు చెప్పిన నిప్పులాంటి నిజాలు..

1000 pages chargesheet on delhi gang rapeదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో మృతిచెందిన  యువతి స్నేహితుడు తొలిసారి గొంతు విప్పాడు. ఓ టీవి ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సభ్యసమాజంపై మండిపడ్డాడు. “అత్యాచారం జరిగిన తర్వాత తమకోసం ఎలుగెత్తిన ఈ సమాజం… తాము ఆపదలో ఉన్నప్పుడు మాత్రం స్పందించలేదని” ఆక్రోశించాడు. అప్పుడే స్పందించి వుంటే తన స్నేహితురాలు మరణించి వుండేది కాదని విలపించాడు.

delhi-gang-repe1పూర్తిసారాంశం అతని మాటల్లోనే… “ఆ రోజు డిసెంబర్ 16వ తేదీ. దక్షిణ ఢిల్లీలోని మునిర్కా బస్ స్టాప్ లో నేను, నా స్నేహితురాలు నిలుచున్నాం. ప్రైవేటు బస్సులోకి మమ్మల్ని ఎక్కించుకునేందుకు అదేపనిగా ప్రయత్నించారు. డ్రైవర్, క్లీనర్ మినహా.. మిగిలిన వాళ్లంతా ప్రయాణికుల్లా నటించారు. మేం 20 రూపాయలు చార్జీగా చెల్లించాం. కాసేపటికే… వాళ్లు నిర్భయను వేధించడం మొదలుపెట్టారు. నేను ఎదురు తిరిగాను. ముగ్గురిని కొట్టాను కూడా. కానీ… మిగిలిన వాళ్లు నాపై ఇనుప రాడ్ తో దాడికి దిగారు. నా తలపై కొట్టారు. నేను స్పృహ కోల్పోయాను. నా స్నేహితురాలిని పక్కకు లాక్కెళ్లారు. మేం బస్సు ఎక్కిన చోటు నుంచి దాదాపు రెండున్నర గంటలపాటు విచ్చలవిడిగా తిరిగారు. మేం అరుస్తున్నాం. కాపాడాలంటూ కేకలు వేస్తున్నాం. వాళ్లు బస్సులోని లైట్లను ఆర్పి వేశారు. తెరలు దించేశారు. మేమిద్దరం గట్టిగా వారిని ఎదిరించాం. నిర్భయ తన సెల్ ఫోన్ నుంచి 100కు డయల్ చేయాలని ప్రయత్నించింది. వారు మొబైల్ ఫోన్ లాక్కొన్నారు. బస్సు నుంచి మమ్మల్ని తోసేముందు కూడా మొబైల్ ఫోన్లు లాక్కొన్నారు. మా బట్టలను చించి వేశారు. సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. అంతేకాదు… నిర్భయను, నన్ను బస్సుతో తొక్కించాలని చూశారు. చివరి క్షణంలో నేను పక్కకు తప్పుకుని, నిర్భయను కూడా పక్కకు లాగాను. ఇద్దరం దుస్తులు లేకుండా రోడ్డుపక్కన పడి ఉన్నాం. దారిన పోయే వారిని, ఆటోలను, కార్లను ఆపేందుకు ప్రయత్నించాం. దాదాపు 25 నిమిషాలపాటు ఎవ్వరూ, ఏ ఒక్కరూ ఆగలేదు.

delhi-gang-repe2ఆ తర్వాత కొద్దిసేపటికి గస్తీ తిరుగుతున్న పోలీసు మమ్మల్ని గమనించాడు. మమ్మల్ని బస్సులో నుంచి తోసేసిన 45 నిమిషాల తర్వాత మూడు పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్లు అక్కడికి చేరుకున్నాయి. సంఘటన జరిగిన స్థలం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో చర్చించుకుంటూ సమయం వృథా చేశారు. పోలీసులు కానీ, అక్కడ గుమికూడిన వారు కానీ మాకు దుస్తులు ఇవ్వాలనే కనీస ఆలోచన కూడా చేయలేదు. అంబులెన్స్ను కూడా పిలవలేదు. ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్నారు. పదే పదే బతిమాలుకున్న తర్వాత… నిర్భయకు ఎవరో బెడ్ షీట్ ఇచ్చారు.

ప్రజల నుంచి కూడా ఒక్కరంటే ఒక్కరూ మాకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. అలా వస్తే… తమను సాక్ష్యులుగా పరిగణించి కోర్టుల చుట్టూ తిప్పుతారని భయపడ్డారేమో! గాయాలతో రక్తమోడుతున్న నిర్భయను నా చేతుల మీదుగా పోలీసుల వ్యాన్ ఎక్కించాను. పోలీసులు ఎవ్వరూ సహకరించలేదు. ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి. శరీరం కప్పుకొనేందుకు దుస్తులు ఇవ్వాలంటూ అడుక్కున్నాను. ఒక వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని మా బంధువులకు ఫోన్ చేశాను. నాకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పాను.మా బంధువులు వచ్చిన తర్వాతే నాకు చికిత్స చేయడం మొదలైంది.

బస్సులో దుండగులు నా తలపై కొట్టడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నాను. రెండు వారాలపాటు చేతులు కూడా కదపలేకపోయాను. ఆస్పత్రిలో నిర్భయను కలిశాను. నన్ను చూసి చిన్నగా నవ్వింది. ఆమె మెజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చిన తర్వాతే… జరిగిన ఘోరం గురించి నాకు పూర్తిగా తెలిసింది. జంతువులు కూడా ఇంత క్రూరంగా, దారుణంగా వేటాడవు.”

ఇదీ… నిర్భయ స్నేహితుడు నోరు విప్పి చెప్పిన నిప్పులాంటి నిజం. వారికి ఆ కాళరాత్రి మిగిల్చిన చేదు అనుభవం. సమాజం కాదు అందులో వున్న మనం ఎంత దిగజారిపోయామో ఢిల్లీ సంఘటనే కాదు చాలా సంఘటనలు మనకి మనల్ని అద్దంలో చూపిస్తున్నాయి. ఇది యావత్ భారతావని సిగ్గుతో తలదించుకునేలా చేసిన సంఘటన. ఇలాంటి సంఘటలనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సభ్య సమాజాన్ని కోరుదాం.