భరతమాత సిగ్గుపడుతోంది!!!

Mother India is ashamed with the Delhi Gang rape incident mainమానవత్వం మరచి ఓ అభాగ్యురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రాక్షసులు తీహార్‌ జైలులో ఉన్నప్పటికీ వారికి పెద్దగా పోయిందేమీ లేదని మానవతావాదులంతా ఒక్కగొంతుకతో ఘోషిస్తున్నారు. కానీ యావత్‌ సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ సంఘటనకు ఓ నిండు ప్రాణం బలైపోవడం దేశంలోని ప్రజలందరికీ 2012లో ఓ మింగుడుపడని చేదు జ్ణాపకంలా, చెరగని మచ్చలా మిగిలిపోయింది. గత 13 రోజులుగా బ్రతకాలన్న తాపత్రయాన్ని వెలిబుచ్చుతూ, మొక్కవోని ధైర్యంతో మృత్యువుతో పోరాడుతూ వచ్చిన ఆ మహిళామూర్తి శనివారం తెల్లవారు ఝామున అలసిపోయి మృత్యువు ఒడిలోకి జారిపోయిన సంగతి తెలిసిందే!

Mother India is ashamed with the Delhi Gang rape incident 1ఇంతకీ ఈ పాపం ఎవరిది? చీకటిపడితే వీధుల వెంట పిచ్చెక్కిన మ(ద)గ కుక్కలు రెచ్చిపోయి తిరుగుతూ ఉంటాయని తెలియక ఆ రోజు రాత్రి రోడ్డెక్కిన ఆ అభాగ్యురాలిదా? మదమెక్కిన రాక్షసులతో ఒంటరిగా పోరాడలేక పోయిన యువతి స్నేహితుడిదా? కామంతో కళ్ళు మూసుకుపోయి తామేం చేస్తున్నామో, ఎంతటి ఘాతుకానికి ఒడిగడుతున్నామో, తమకు పుట్టుకనిచ్చిన ఓ మాతృమూర్తి అంశనే చెరబడుతున్నామన్న ఇంగితం మరచిన ఆ ఆరు పశువులదా? సాక్షాత్తూ దేశరాజధానిలోనే రాత్రి దాదాపు 9గంటల 30నిమిషాలకే కళ్ళు మూతలు పడ్డ రక్షణ వ్యవస్థదా? భారత దేశ రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాజకీయ పార్టీల అగ్రనాయకత్వం, కేంద్ర మంత్రులు…. ఒక్కరేమిటి యావద్భారత దేశంలో వేళ్ళమీద లెక్కించదగ్గ ప్రముఖులున్న దేశరాజధాని అయినట్టి ఢిల్లీ నగరంలో దాదాపుగా 40 నిమిషాలపాటు నిర్భయంగా నగర రహదారులపై యదేచ్చగా అత్యాచార కాండ సాగించగలిగారంటే ఎవరిలో ఉంది లోపం? భరతమాత(స్త్రీమూర్తి అయిన పాపానికి) సిగ్గుపడ్డ ఆ సామూహిక అత్యాచార దురాగతం తరువాత వివస్త్రగా నడిరోడ్డుపైన బాధితురాలిని పడవేస్తే.. తన శరీరంపై కనీసం ఓ గుడ్డముక్కనైనా కప్పాలన్న కనికరం రాని సమాజాన్నేమనాలి? ఇంతటి ఘాతుకం జరిగి దేశయువత యావత్తూ భగ్గుమంటే… దేశప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాసేవకులుగా ఉండవలసిన పాలకులకు రక్షణ కల్పించాలన్న కారణం చూపి యువతపై విరుచుకు పడిన రక్షకదళాన్ని ఏమనాలి? ఇవన్నీ సరిపోవన్నట్టు నోరుంది కానీ, నాలుకకు నరం లేదన్నట్టు అవాకులు, చవాకులు పేలిన రాజకీయ ప్రముఖులను ఎలా అర్థం చేసుకోవాలి?

Mother India is ashamed with the Delhi Gang rape incidentఆవేదనతో కుమిలిపోయి… ఆవేశంతో రగిలిపోయిన యువత, తమ ఇంటి ఆడపిల్లల రక్షణ గురించి ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులు… ఎవరిని కదిలించినా లక్షలాది అనుమానాలు, ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ మన దురదృష్టమేంటంటే మనకు అన్నిచోట్లా, అందరినోటా ప్రశ్నలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ ఇన్ని లక్షల ప్రశ్నలకు కనీసం ఒక్కటంటే ఒక్కటయినా సమాధానం మాత్రం దొరకడం లేదు. దీనికి సమాధానం ఎవరిస్తారు… ఎవరివ్వాలి… ఇది కూడా ఓ సమాధానం లేని ప్రశ్నేనా???

Mother India is ashamed with the Delhi Gang rape incident 2ఇన్ని ప్రశ్నలు, ఆవేదనలు, ఆందోళనలు, ఆవేశాల మధ్య కూడా ఒక్కటే ఉపశమనం… ఈ భరించలేని విపత్కర పరిస్థితుల నుండి ఆ బంగారుతల్లికి శెలవు దొరికింది… కనీసం ఆ భగవంతుడి సన్నిధిలోనయినా ప్రశాంతంగా, తన తోటి సమాజం నుండి విముక్తి లభించిన జీవితం దొరికిందన్న నీరు నిండిన కన్నుల భాష్పానందం…. ఇది మా(తెలుగుమిర్చి.కాం) ఒక్కరి  ఆవేదన  కాదు… మా(తెలుగుమిర్చి.కాం) ఒక్కరి  ఆలోచన కాదు… మా(తెలుగుమిర్చి.కాం) ఒక్కరి  ఆవేశం కాదు…. మనసున్న ప్రతీ మనిషి గుండెలోతుల నుండి పెల్లుబుకుతున్న భావావేశాల నుండి పుడుతున్న ఆలోచన….

స్పందించండి…  మీ స్పందనలతో(comments) మీలోని ఆవేశాన్ని, ఆలోచనలను తెలియచెప్పండి….