కలుగుల్లోకి పోదాం రండి…..

భాగ్యనగరి గుండె మీద
ఉగ్రవాద నృత్యం !
ముష్కర మూకలకెపుడూ
హింస నిత్యకృత్యం !!

భాగమతీ నుదుటిమీద
జన నెత్తుటి సింధూరం !
హైద్రబాదు ఆసాంతం
తీవ్రవాద ప్రాకారం !!

అలసత్వం పెరిగినపుడు
మారణహోమం షురూ !
పుడుతూనే వుంటారోయ్
కసబ్బు అఫ్జల్ గురూ !!

స్టేటూ సెంటరు మధ్యన
హెచ్చరికల వివాదం !
రక్తపు మడుగుల్లోపల
పొందకండి వినోదం !!

ఎప్పుడు ఏమవుతుందోనని
సామాన్యుడి బతుకు భయం !
సర్కారీ నిర్లక్ష్యం
కాకూడదు అయోమయం !!

పరామర్శ పలకరింపు
పరిష్కారమవదయ్యా !
ముందు కళ్ళు తెరవాలీ
ముఖ్యమంత్రి భయ్యా !!

రక్షక భటులేరయ్యా
ప్రజలకెక్కడుంది రక్ష !
నాయకులేమయ్యారూ
ఓట్లు వేసినందుకా శిక్ష !!

జనభద్రత లేనప్పుడు
సర్కారెందుకు వ్యర్ధం !
సచివాలయ భవనాలకు
పెట్టేద్దాం శ్రాద్ధం !!

– ఏవీయస్