ఫ్లాష్ న్యూస్ 29-06-2019

* భారత్‌ నుంచి ఏటా హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7లక్షల నుంచి 2లక్షలకు పెంచనున్నట్లు సౌదీఅరేబియా తెలిపింది.ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, సౌదీఅరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపారు.ఈసందర్భంగా హజ్‌కోటా పెంపుపై ఇరువురు చర్చించుకున్నారు.

* తూర్పు నౌకాదళం పనితీరు, ఈ ప్రాంతంలో జరుగుతున్న విస్తరణ, ఇతర ప్రాజెక్టులను పరిశీలించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం విశాఖపట్నం వస్తున్నారు.అనంతరం జరిగే ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పాల్గొననున్నారు.

* అమర్ నాథ్ యాత్రకు జమ్ము అధికారులు సర్వం సిద్ధం చేశారు.జూలై 1న ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్ర 40 రోజుల పాటు కొనసాగనుంది.యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టారు. యాత్ర సజావుగా జరిగేలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.

* ప్రధాని మోదీ రేడియో ద్వారా సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఆదివారం నుంచి పున: ప్రారంభం కానుంది.ప్రధాని అయ్యాక మరోసారి మే నెలలో కలుసుకుందామని చివరి కార్యక్రమం ఫిబ్రవరి 24నే శ్రోతలకు తెలిపారు.దాదాపు 3నెలల తరువాత జూన్‌లో మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలను పలకరించబోతున్నారు.

* రాష్ట్ర ప్రభుత్వం 43 మంది డీఎస్పీ (సివిల్‌), ఏపీఎస్పీ సహాయ కమాండెంట్లను బదిలీ చేసింది. వీరిలో ఏడుగురికి పోస్టింగ్‌ ఇచ్చింది. మిగతా 36 మందిని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొంది. ఈమేరకు డీజీపీ గౌతం సవాంగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

* మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది.పుణెలో భారీవర్షం ధాటికి ఈ తెల్లవారుజామున గోడకూలి 17మంది మృతి చెందారు.మృతుల్లో 4గురు చిన్నారులు,ఓ మహిళ ఉన్నారు.గోడ కూలి పక్కనే వలస కూలీలు నివసిస్తున్న రేకులషెడ్లపై పడింది.మృతులంతా బిహార్‌,బెంగాల్‌కు చెందిన భవననిర్మాణ కూలీలేనని అధికారులు తెలిపారు.